(MS8NEWS జనవరి 2 రామడుగు కరీంనగర్ జిల్లా): వృద్ధాప్యం అనేది కేవలం వయసుకే కానీ, సంకల్పానికి కాదని నిరూపిస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వృద్ధుడు. శ్రమను నమ్ముకుంటే ఏ వయసులోనైనా ఆత్మగౌరవంతో బతకవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.
వృత్తే దైవం – శ్రమే జీవనం
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన కొండ నారాయణ గౌడ్ వయస్సు ప్రస్తుతం 95 ఏళ్లు. ఈ వయసులో చాలామంది విశ్రాంతి కోరుకుంటారు లేదా ఇతరులపై ఆధారపడతారు. కానీ నారాయణ గౌడ్ గారు మాత్రం ఇప్పటికీ రోజూ 4 తాటి చెట్లు ఎక్కుతూ కల్లు గీస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు.
తన పిల్లలపై ఆధారపడకుండా, భార్యతో కలిసి గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నారు. 95 ఏళ్ల వయసులోనూ తాటి చెట్టు ఎక్కడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన ఆరోగ్యం, పట్టుదల చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
యువతకు సందేశం: చిన్న కష్టానికే కుంగిపోయే నేటి యువతకు, సోమరితనంతో కాలం గడిపేవారికి నారాయణ గౌడ్ గారి జీవితం ఒక గొప్ప కనువిప్పు.”కాయకష్టమే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని, కష్టపడే తత్వం ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని” ఆయన జీవితం మనకు చెబుతోంది.వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నిజంగా అభినందనీయం.

