MS8NEWS మార్చ్ 1గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్‌లో గల ‘ఆపిల్ కిడ్స్’ విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజు, 40వ డివిజన్ కార్పొరేటర్ కజంపురి రాజేందర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు.ఈ సందర్భంగా 52వ డివిజన్ కార్పొరేటర్ (కాంగ్రెస్) చిదురాల నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, నూతన ఆవిష్కరణలు తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై విద్యార్థులు ఇచ్చిన వివరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు. సమాజం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్న పర్యావరణ అంశాలను సైతం చిన్నారులు ఎంతో స్పష్టంగా వివరించడం వారి అపారమైన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. వీరే రేపటి భవిష్యత్ శాస్త్రవేత్తలుగా, గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం, రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో.. తమ డివిజన్‌లో విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాగరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా తనను ఆహ్వానించిన ఆపిల్ కిడ్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు

