Monday, April 13, 2026

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి

 

MS8NEWS గోదావరిఖని, ఫిబ్రవరి 04 : రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి కోరారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మారుతినగర్ (60వ డివిజన్), విఠల్ నగర్ (12వ డివిజన్)లలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై పలు కీలక సూచనలు చేశారు:

  •  సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • ప్రచారాన్ని ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 గంటల లోపు ముగించాలని, మైక్ వినియోగానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ర్యాలీలు నిర్వహించే అభ్యర్థులు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
  •  ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, మసీదులపై వాల్ పోస్టర్లు అంటించడం నేరమని, ప్రైవేట్ గోడలపై ప్రచారం చేయాలంటే యజమాని అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
  • పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని, కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు. అభ్యర్థులు, అనుచరులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు.
  • ఫిబ్రవరి 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అప్పటి వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, టపాకాయలు కాల్చకూడదని ఆదేశించారు.
  •  అనుచరులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అభ్యర్థులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇన్స్‌పెక్టర్ హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థులు అహంకారాన్ని వీడి, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ లక్ష్యమని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్, అనూష, స్థానిక ప్రజాప్రతినిధులు, బ్లూకోల్ట్స్ సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular