MS8NEWS జనవరి 24 చెన్నై:నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పక్కవాడి గురించి పట్టించుకునే సమయం ఎవరికీ ఉండదు. కానీ, తమిళనాడులోని ఓ సేల్స్‌మ్యాన్ మాత్రం తన చిన్నపాటి ఆలోచనతో మానవత్వాన్ని చాటుకున్నాడు. ఖరీదైన షోరూమ్‌లలోని వస్తువులను కొనే స్తోమత లేని ఆ చిన్నారుల కళ్లల్లో ఆనందం నింపుతూ సోషల్ మీడియాలో హీరోగా నిలిచాడు.తమిళనాడులోని ప్రముఖ ‘డార్లింగ్ డిజిటల్ వరల్డ్’ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ బయట రోజూ కొందరు నిరుపేద పిల్లలు నిలబడేవారు. లోపల మెరుస్తున్న రంగుల టీవీలు, అందులో వచ్చే బొమ్మలను చూస్తూ మురిసిపోయేవారు. ఇది గమనించిన అక్కడి సేల్స్‌మ్యాన్, వారిని బయటకు గెంటేయకుండా.. వారికోసం ప్రత్యేకంగా డిస్‌ప్లే టీవీలో వారికి ఇష్టమైన కార్టూన్లను ప్లే చేయడం ప్రారంభించాడు.
నెటిజన్ల ఫిదా..షోరూమ్ అద్దాల అవతల నిలబడి, టీవీలో వస్తున్న బొమ్మలను చూస్తూ ఆ పిల్లలు ఆనందంతో గెంతులేస్తున్న దృశ్యాలను ఎవరో మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు సదరు సేల్స్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.”చిన్న సహాయమే కావచ్చు, కానీ ఆ పిల్లల ముఖాల్లో చిరునవ్వు కోట్లాది రూపాయల కంటే విలువైనది” అని నెటిజన్లు కొనియాడుతున్నారు.సాధారణంగా షోరూమ్ యజమానులు ఇలాంటి వారిని దూరంగా పంపిస్తుంటారు. కానీ, సంస్థ నిబంధనలకు అతీతంగా, ఆ సేల్స్‌మ్యాన్ చూపిన ఈ చొరవ సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది. “మానవత్వం అంటే కేవలం డొనేషన్లు ఇవ్వడమే కాదు.. ఇలా పక్కవారి సంతోషం కోసం చిన్న ప్రయత్నం చేయడం కూడా” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

