Monday, April 13, 2026

కొండగట్టులో ‘అంజన్న’ అర్చకుల నిరసన: ఈవో వర్సెస్ అర్చకులు

MS8NEWS జనవరి 24 జగిత్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) శ్రీకాంత్ రావు వైఖరిని నిరసిస్తూ అర్చకులు భారీ ధర్నాకు దిగారు. రాజగోపురం ముందు బైఠాయించి ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆలయ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.శుక్రవారం ఉదయం ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు భారీ అనుచరగణంతో కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఈవో అర్చకులను తీవ్రంగా మందలించారు. ఇది కాస్తా ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అర్చకులను, చివరకు జిల్లా స్థాయి అధికారులను కూడా గౌరవించకుండా మాట్లాడుతున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. అధికారులకు, అర్చకులకు మధ్య ఈవో తీరు వల్ల కనీస సమన్వయం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవోపై తక్షణమే విచారణ జరిపించాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భక్తుల భిన్న స్వరాలు:ఒకవైపు అర్చకులు నిరసన తెలుపుతుండగా, మరోవైపు భక్తుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ రావు ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి:ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని.సిఫారసులకు తావులేకుండా పారదర్శకమైన సంస్కరణలు అమలు చేస్తున్నారని పలువురు భక్తులు ప్రశంసిస్తున్నారు.

పోలీసు బందోబస్తు:నిరసన ఉధృతం కావడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయ ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

Related Articles

Most Popular