MS8NEWS మంచిర్యాల, జనవరి 22: సాధారణంగా ఆవులకు సాత్విక గుణం ఉంటుందని అంటుంటారు. కానీ, తన మందకు ఆపద ఎదురైతే అవి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాయని నిరూపించింది ఒక ఆవు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ కార్నర్ వద్ద జాతీయ రహదారిపై ఆవుల మంద నిలబడి ఉంది. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక ట్రాక్టర్ డ్రైవర్, రోడ్డుపై ఉన్న ఆవులను గమనించి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ దాదాపు ఆవుల మీదకు వెళ్లినంత పని అయింది.డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆగ్రహం చెందిన ఒక ఆవు, ట్రాక్టర్ను వెంబడించడం ప్రారంభించింది. అది సామాన్యంగా కాదు.. సుమారు అర కిలోమీటరు మేర జాతీయ రహదారిపై ట్రాక్టర్ను వెంటాడుతూ పరుగెత్తింది. ట్రాక్టర్ వేగంగా వెళ్తున్నా, ఆవు ఏమాత్రం తగ్గకుండా దాని వెంటే దూసుకెళ్లింది. ఈ వింత దృశ్యాన్ని వెనుక వస్తున్న ఓ వాహనదారుడు తన సెల్ ఫోన్లో బంధించారు.రోడ్డుపై ట్రాక్టర్ను ఆవు వెంటాడుతున్న దృశ్యాలు చూసి వాహనదారులు విస్తుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “జంతువులకైనా ఆత్మరక్షణ తెలుసు” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి” అని మరికొందరు సూచిస్తున్నారు.

