MS8NEWS జనవరి 16:రామగుండం:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ల కేటాయింపులో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ భూక్యా రాము నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ పరిధిలో గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. గతంలో 34 వార్డులు ఉన్నప్పుడు గిరిజనులకు ఒక సీటు కేటాయించారని, ఆ తర్వాత 50 డివిజన్లయినా అదే పరిస్థితి కొనసాగిందని గుర్తుచేశారు. ఇప్పుడు తాజాగా 60 డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికీ, గిరిజనులకు కేవలం ఒక్క సీటుకే పరిమితం చేయడం అన్యాయమన్నారు.
జనాభా దామాషా ప్రకారం అన్యాయం: రామగుండం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 4 శాతం ఉన్న గిరిజనులకు, కేవలం 1 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం వారి రాజకీయ ఎదుగుదలను అణిచివేయడమేనని విమర్శించారు.
10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ స్ఫూర్తితో, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం రెండు డివిజన్లను ఎస్టీలకు కేటాయించాలని కోరారు.
ఈ సమస్యపై గౌరవ ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి మరియు ఎన్నికల కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ.. రేపు (శనివారం) సచివాలయంలో స్వయంగా కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు రాము నాయక్ తెలిపారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రాజకీయ హక్కులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

