MS8NEWS జనవరి 15 :హైదరాబాద్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. నగరవాసులంతా తమ సొంత ఊర్లకు పయనమవుతారు. ఇదే అదనుగా భావించే దొంగలు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అయితే, ఒక ఇంటి యజమాని మాత్రం దొంగలకు ముందే ‘క్లారిటీ’ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.
అసలేం జరిగిందంటే?
సాధారణంగా ఎవరైనా ఊరెళ్తే, దొంగలకు తెలియకుండా జాగ్రత్తలు పడతారు. కానీ, ఈ ఇంటి యజమాని రూటే సెపరేటు. తన ఇంటి తలుపుకు ఒక తెల్ల కాగితంపై పెద్ద అక్షరాలతో ఒక నోటీసు రాసి అతికించారు. అందులో ఇలా ఉంది:
”మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాము… ‘డబ్బు, నగలు’ తీసుకొని పోతున్నాము… మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి.”
ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.”
యజమాని చాలా తెలివైన వాడు, దొంగలకు తాళం పగులగొట్టే శ్రమ తప్పించాడు” అని కొందరు..
”పాపం దొంగలు ఆశగా వచ్చి బోర్డు చూసి నిరాశతో వెనుతిరుగుతారేమో” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా చివర్లో ‘మీ శ్రేయోభిలాషి’ అని రాయడం ఈ లేఖలో హైలైట్ అని చెప్పవచ్చు.
పోలీసుల సూచన:ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, ప్రజలు ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా నోటీసులు పెట్టడం వల్ల ఇంట్లో ఎవరూ లేరని దొంగలకు సులభంగా తెలిసిపోతుందని, దీనివల్ల ఆస్తి నష్టం జరగకపోయినా, ఇంట్లోని ఇతర వస్తువులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఊరెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని లేదా సిసి కెమెరాల నిఘా ఉంచుకోవాలని కోరుతున్నారు.

