(MS8NEWS గోదావరిఖని, జనవరి 12):సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు, విహార యాత్రలకు వెళ్లే సమయంలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పండుగ సమయంలో చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని, అయితే ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రజలు పాటించాల్సిన భద్రతా సూచనలు:
విలువైన వస్తువుల భద్రత: ఊరికి వెళ్లేవారు నగదు, బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలి. బీరువా తాళాలను ఇతరులకు దొరికే చోట ఉంచకుండా తమ వెంట తీసుకెళ్లాలి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇంటికి తాళం వేసి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే, ఆ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తామని సీఐ తెలిపారు.
టెక్నాలజీ వినియోగం: సాధ్యమైనంత వరకు ఇళ్లకు సెంట్రల్ లాక్ సిస్టమ్, మోషన్ సెన్సర్లు ఏర్పాటు చేసుకోవాలి. కేవలం వెయ్యి రూపాయలకే ఆన్‌లైన్‌లో దొరికే సీసీ కెమెరాలను అమర్చుకోవడం ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్‌లో ఇంటిని పర్యవేక్షించవచ్చని ఆయన సూచించారు.
వాహనాల రక్షణ: ద్విచక్ర వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసి, వీల్ లాక్స్ లేదా చైన్లతో గట్టిగా లాక్ చేయాలి.
అప్రమత్తత అవసరం: తాళం వేసినట్లు బయటకి తెలియకుండా డోర్ కర్టెన్లు వేయాలి. రాత్రి వేళ ఇంట్లో లేదా బయట లైట్లు వెలుగుతూ ఉండేలా చూడాలి. ఇంటి ముందు న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు పేరుకుపోతే దొంగలు నిఘా పెట్టే అవకాశం ఉన్నందున, పక్కింటి వారికి చెప్పి వాటిని తొలగించే ఏర్పాటు చేసుకోవాలి.
అనుమానితులు కనిపిస్తే ‘100’ కి కాల్ చేయండి:
మీ కాలనీల్లో లేదా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఇంద్రసేన రెడ్డి కోరారు. “మీ జాగ్రత్తే మీ ఇంటికి ఉత్తమ రక్షణ” అని పేర్కొంటూ ప్రజలందరూ భద్రతా సూచనలు పాటించి సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

