(MS8NEWS జనవరి 10):గోదావరిఖని: అభినయ కల్చరల్ ఆర్ట్స్ 43వ కలోత్సవాల సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ మహిళలకు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. స్థానిక శ్రీ కోదండ రామాలయం మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ పెద్దేల్లి తేజస్విని – ప్రకాష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల ముగ్గులతో మైదానాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు.ఈ పోటీలకు ఆపిల్ కిడ్స్ కరస్పాండెంట్ గాలి సునీత, లయన్స్ క్లబ్ మగువ సెక్రటరీ శశికళ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి మిక్సీ గ్రైండర్, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి పట్టు చీర, మూడవ స్థానంలో నిలిచిన వారికి ఐరన్ బాక్స్ మరియు కన్సలేషన్ విజేతలకు కెటిల్ అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ.. మన పండుగ సంప్రదాయాలను ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభినయ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రేణుకుంట్ల రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పీ సరోజ, కందునూరి రామస్వామి, బొమ్మ ప్రభాకర్, కాలనీ పెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు.

