(MS8NEWS JANAVARI 9):గోదావరిఖని: సంక్రాంతి పండుగ వేళ ప్రమాదకరమైన చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు రామగుండం పోలీసులు రంగంలోకి దిగారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.దుకాణాల పరిశీలన: పట్టణ కేంద్రంలోని వివిధ గాలిపటాల విక్రయ కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించి, నిషేధిత చైనా మాంజా నిల్వలను తనిఖీ చేశారు. చైనా మాంజా వల్ల చిన్నారులు, వాహనదారులు మరియు పక్షులకు ప్రాణాపాయం పొంచి ఉందని, అందుకే దీనిపై నిషేధం విధించినట్లు సీఐ తెలిపారు.నిబంధనలు అతిక్రమించి చైనా మాంజాను విక్రయించినా లేదా నిల్వ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.“చైనా మాంజా విక్రయం మరియు వినియోగం పూర్తిగా నిషేధం. ప్రజల భద్రత దృష్ట్యా వ్యాపారులు సహకరించాలి. ఎక్కడైనా రహస్యంగా విక్రయాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.” అనీ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ తనిఖీల్లో ఎస్‌ఐలు రమేష్, అనూష మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

