(MS8NEWS జనవరి 6):గోదావరిఖని:మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 మందిని పోలీసులు మంగళవారం గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరిచారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఈ విధంగా తీర్పు వెల్లడించారు
జైలు శిక్ష: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడిన ఒక వ్యక్తికి 05 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం సదరు వ్యక్తిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
భారీ జరిమానా: మిగిలిన 12 మందికి కలిపి మొత్తం 28,000/- రూపాయల జరిమానా విధించారు.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హెచ్చరిక:
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

