Monday, April 13, 2026

​జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం: స్ట్రెచర్‌పై మామను మోసుకెళ్లిన కోడలు!

(MS8NEWS జనవరి 6):జగిత్యాల: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. అత్యవసర స్థితిలో వచ్చిన రోగికి సపర్యలు చేయాల్సింది పోయి, సిబ్బంది కనీసం స్పందించకపోవడంతో ఒక మహిళ తన మామను స్ట్రెచర్‌పై మోసుకెళ్లాల్సి వచ్చింది.జైనా గ్రామానికి చెందిన రాజ నర్సయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు విరగడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయన్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రికి చేరుకున్న అరగంట వరకు ఏ ఒక్క సిబ్బంది కూడా పట్టించుకోలేదు. తన మామ పడుతున్న నరకయాతనను చూడలేకపోయిన ఆయన కోడలు, ఇక లాభం లేదని భావించి తానే స్వయంగా స్ట్రెచర్‌ను నెట్టుకుంటూ ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డు వద్ద కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

​ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి ఉండటం దురదృష్టకరం” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Most Popular