(MS8NEWS జనవరి 4):సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని RG-1 ఏరియా ఓసిపి-5 ప్రాజెక్టును తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ (TRS-D) పార్టీ రాష్ట్ర నాయకులు సందర్శించారు.ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టులో జరుగుతున్న బాంబు పేలుళ్ల తీవ్రతను, వాటి వల్ల స్థానిక నివాసాలకు కలుగుతున్న నష్టాన్ని వారు స్వయంగా పరిశీలించారు. ఓసిపి-5లో జరుపుతున్న భారీ బాంబు పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలు పగుళ్లు ఇస్తున్నాయని, ఏ క్షణంలో ఇండ్లు కూలిపోతాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.పేలుళ్ల ద్వారా వెలువడే దుమ్ము, ధూళి వల్ల చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని నేతలు పేర్కొన్నారు.రెండు రోజుల క్రితమే RG-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ని కలిసి సమస్య తీవ్రతను వివరించి, బాంబు పేలుళ్లను నివారించాలని వినతి పత్రం అందజేశారు.
ప్రాజెక్టు సందర్శన – అధికారుల హామీ:
ఈరోజు పార్టీ నాయకులు సింగరేణి అధికారుల అనుమతితో నేరుగా ప్రాజెక్టులోకి వెళ్లి, పేలుళ్లు జరిపే విధానాన్ని అడిషనల్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు.పేలుళ్ల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

