(MS8NEWS జనవరి 4):గ్రామాల్లో కోతుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఇళ్లపై పడి తినుబండారాలు ఎత్తుకెళ్లడమే కాకుండా, పసిపిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కోతుల బెడద నుండి గ్రామాన్ని విముక్తి చేసేందుకు ఎక్లాస్ పూర్ గ్రామ పాలకమండలి, యువత కలిసి ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.ఎలుగుబంటి వేషధారణతో వినూత్న ప్రయత్నం కోతులు సాధారణంగా పెద్ద జంతువులకు, ముఖ్యంగా ఎలుగుబంట్లకు భయపడతాయనే ఆలోచనతో గ్రామ యువత మరియు పాలకమండలి సభ్యులు ఎలుగుబంటి వేషం ధరించి గ్రామంలో కలియతిరుగుతున్నారు. ఈ విచిత్ర వేషధారణను చూసి కోతులు భయపడి గ్రామం పొలిమేరల దాకా పారిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వయంగా పాల్గొని యువతను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు పాలకమండలి సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలను కోతులు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. కళ్లముందే పంట నాశనమవుతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు.పిల్లలు బయట ఆడుకోవాలన్నా, వృద్ధులు బయట కూర్చోవాలన్నా కోతులు ఎప్పుడు దాడి చేస్తాయోనని భయం పట్టుకుంది. ఇటువంటి వినూత్న ప్రయత్నాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి కోతుల నియంత్రణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు కోరుతున్నారు.
”మేము మా వంతు ప్రయత్నంగా ఇలా ఎలుగుబంటి వేషాలు వేసి తోలుతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించి కోతులను పట్టుకుని అడవుల్లో వదిలేయడానికి లేదా సంతానోత్పత్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.” – ఎక్లాస్ పూర్ గ్రామస్తులు.
ఇప్పటికే తెలంగాణలోని నిర్మల్ జిల్లా లింగాపూర్ వంటి గ్రామాల్లో కూడా సర్పంచ్‌లు ఇలాంటి ప్రయత్నాలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో ‘మంకీ ఫుడ్ కోర్టులు’ ఏర్పాటు చేసి, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

