(MS8NEWS డిసెంబర్ 25):విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి (GGH) ఆవరణలోని క్యాంటీన్‌లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ క్యాంటీన్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. క్యాంటీన్ నిర్వాహకులు వండి పక్కన పెట్టిన నూడుల్స్ గిన్నెలో ఎలుకలు దూరి యథేచ్ఛగా తింటున్న దృశ్యాలను అక్కడ ఉన్న ఒక పీజీ (PG) వైద్య విద్యార్థి తన ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో బయటకు రావడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.వాస్తవానికి ఈ క్యాంటీన్ డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడవాలి. కేవలం టిఫిన్, భోజనం అమ్మడానికి మాత్రమే అనుమతి ఉండగా, నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను కూడా నడుపుతున్నట్లు తెలిసింది.ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో, రోగులు మరియు వారి సహాయకులు భోజనం చేసే చోట ఇంతటి అపరిశుభ్రత ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎలుకలు ఆహారాన్ని తింటున్న వీడియో వైరల్ కావడంతో, ప్రజలు ఆసుపత్రి యంత్రాంగంపై మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు క్యాంటీన్‌పై చర్యలు తీసుకునే దిశగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

