(MS8NEWS డిసెంబర్ 21): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద జరిగిన నవ దంపతుల మృతి ఘటన కలకలం రేపుతోంది. మొదట ఇది కేవలం ప్రమాదమని భావించినప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ఘటనకు కొత్త మలుపు (Twist) ఇస్తున్నాయి.
కోరాడ సింహాచలం (25), భవాని (19). వీరు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలం, రావుపల్లి గ్రామానికి చెందినవారు.వీరిద్దరూ ప్రేమించుకుని, కేవలం రెండు నెలల క్రితమే పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.
విషాదంలో ట్విస్ట్.. ఏం జరిగింది?
రైలు వంగపల్లి – ఆలేరు స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రయాణంలో దంపతులిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పరస్పరం వాదించుకుంటున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్తతో గొడవ పడిన భవాని, తీవ్ర ఆవేశంతో రన్నింగ్ రైలులో నుంచి ఒక్కసారిగా కిందకు దూకేసింది. తన కళ్ల ముందే భార్య దూకేయడంతో భయాందోళనకు గురైన సింహాచలం, ఆమెను కాపాడబోయో లేదా ఆ బాధతోనో తాను కూడా వెంటనే రైలు నుండి దూకేశాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ట్రాక్‌మెన్‌లు మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు దర్యాప్తు: రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గొడవకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
గమనిక: గొడవలు ఏవైనా కావచ్చు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను బలిగొంటాయి. ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న వ్యక్తులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

