(MS8NEWS డిసెంబర్ 29):గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ— సింగరేణి సంస్థపై హరీశ్ రావు మాట్లాడే నైతిక అర్హతే లేదని తీవ్రంగా విమర్శించారు.మీ పదేళ్ల పాలనలోనే పార్లమెంట్‌లో మీ పార్టీ ఎంపీలు సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రకు మద్దతుగా బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి నిధులను ఇష్టారాజ్యంగా వినియోగించి, సంస్థపై సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు మోపారు. అంతేకాదు, సింగరేణి సొమ్మును సిద్దిపేటకు తరలించి, ఆ నిధులతో అక్కడ స్టేడియం నిర్మించిన విషయాన్ని కార్మికులు, ప్రజలు మరువలేదన్నారు. ఇలాంటి నేపథ్యంతో ఇప్పుడు సింగరేణి మీద, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.మీ పాలనలోనే మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ, కార్మికుల పిల్లలకు కనీస స్థాయిలో మెడికల్ సీట్లు సక్రమంగా కేటాయించలేకపోయిన ఘోర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కార్మికులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా కల్పించినది వాస్తవం కాదా? ఎన్నడూ లేనివిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 పెంపు, ఈ ఏడాది బోనస్‌ను రూ.5,500కు పెంచినది నిజం కాదా? అలాగే సింగరేణి నియామకాల్లో 35–40 సంవత్సరాల వయో పరిమితి పెంపు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేక బోనస్, బీసీ లైజనింగ్ అధికారిని నియమించడం వంటి కీలక నిర్ణయాలు కార్మికుల సంక్షేమానికి దోహదపడ్డాయని గుర్తు చేశారు.మీ పాలనలో సింగరేణికి కొత్త బొగ్గు బావులు రాకుండా కుట్రలు చేసి, సంస్థ అస్తిత్వాన్నే దెబ్బతీశారని, ఆర్థికంగా బలహీనపరిచారని విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో సింగరేణి ఎలా వంచించారో అప్పటి TRS అనుబంధ కార్మిక సంఘం అయినా కవిత ను అడిగితే చెప్తుందని అన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా సింగరేణిపై ప్రేమ చూపించినా, కార్మికులు గానీ, ప్రజలు గానీ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.ప్రస్తుత ప్రభుత్వం సింగరేణిని బలపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, రాజస్థాన్ ప్రభుత్వంతో సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఒప్పందాలు, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వంటి నిర్ణయాలు సింగరేణి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతులను, కార్మికులను ఇబ్బంది పెట్టినప్పటికీ, వాటిని ఎదుర్కొంటూ కార్మిక–రైతు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల నాయకత్వంలో సింగరేణి సంస్థను బలపరచి, కార్మికుల హక్కులను కాపాడుతున్న ప్రస్తుత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకుని, మీ పాలనలో చేసిన తప్పులకు ముందుగా సమాధానం చెప్పాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామని జనక్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి , ధర్మపురి , కాంపల్లి సమ్మయ్య, త్యాగరాజన్ , జెట్టి శంకర్ రావు, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్ , ఏనుగు రవీందర్ రెడ్డి , సెక్రటరీ రాపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

