MS8NEWS పాలకుర్తి (రామగుండం), జనవరి 21:రామగుండం నియోజకవర్గ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సుమారు 23 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేశారు.
7 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాంత్రీకరణ పథకంగత ఏడేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులకు శ్రమ తగ్గించి, దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో 50 శాతం రాయితీతో ఈ పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా:రోటావేటర్లు,బ్యాటరీ స్ప్రేయర్లు,కల్టివేటర్లు,పవర్ టిల్లర్లు,వరి గడ్డి కోత యంత్రాలు,కలుపు తీసే యంత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఎలకలపల్లిలో యూరియా సబ్ సెంటర్ ప్రారంభం:ఎలకలపల్లి, గుంటూరుపల్లి, లక్ష్మీపూర్ ప్రాంత రైతుల చిరకాల కోరికను తీరుస్తూ గ్రామంలో నూతనంగా యూరియా బ్రాంచ్ (సబ్ సెంటర్) ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఎరువుల కోసం కన్నాల లేదా కమాన్ పూర్ వరకు వెళ్లాల్సి వచ్చేది. పాలకుర్తి వ్యవసాయ శాఖ వారు నూతనంగా లైసెన్స్ జారీ చేయడంతో, ఇకపై స్థానికంగానే నిరంతరాయంగా యూరియా అందుబాటులో ఉండనుంది.”ప్రభుత్వం సుమారు 15 రకాల యంత్రాలను రాయితీపై అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి గల రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.” – రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్, ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో రామగుండం ఏఎంసీ చైర్మన్ గాలిపెల్లి తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, ఏడీఏ శ్రీనాథ్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్, రామగుండం ఏఓ (ఇంచార్జ్) కొప్పుల ప్రకాష్, ఎలకలపల్లి, గుంటూరుపల్లి సర్పంచులు, ఏఈఓలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

