రామగుండం, ఫిబ్రవరి 23 (MS8NEWS ప్రతినిధి):రహదారి భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “అరైవ్ అలైవ్ 2026” (2వ దశ) కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) ఆదేశాల మేరకు సోమవారం స్థానిక బి-పవర్ హౌస్ ఏరియాలో లారీ, ఆటో మరియు స్కూల్ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ విధిగా లేన్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలను ఓవర్టేక్ చేసే సమయంలో డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, కేవలం కుడివైపు నుంచి మాత్రమే ఓవర్టేకింగ్ చేయడానికి అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయడం పూర్తిగా నిషేధమని, దీనివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే, రోడ్డుపై నెమ్మదిగా వెళ్లే వాహనాలు ఎల్లప్పుడూ రహదారికి ఎడమ వైపునే ప్రయాణించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ “అరైవ్ అలైవ్ 2026” రెండవ దశ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్సైలు జి. హరి శేఖర్, ఎన్. రామరాజు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

