(MS8NEWS డిసెంబర్ 21):మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. క్రీడా మైదానంలోకి దిగి విద్యార్థులతో కలిసి కబడ్డీ, ఫుట్‌బాల్ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు.మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి పురపాలక పరిధిలోని జగన్‌గూడ గ్రామంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడల మీట్ 2025-26 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.కేవలం అతిథిగా ఉండిపోకుండా, మల్లారెడ్డి స్వయంగా మైదానంలోకి దిగి క్రీడాకారుల్లో జోష్ నింపారు.విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడుతూ “కూత” పెట్టారు. ప్రత్యర్థి జట్టును ఢీకొంటూ ఆయన చూపిన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది.కబడ్డీతో పాటు కాసేపు ఫుట్‌బాల్ కూడా ఆడి విద్యార్థులతో సరదాగా గడిపారు.మల్లారెడ్డి కబడ్డీ ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మల్లారెడ్డా.. మజాకా!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

