MS8NEWS ఫిబ్రవరి 21మంథని, పెద్దపల్లి జిల్లా (స్పెషల్ రిపోర్ట్): పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పనుల కోసం సామాన్య ప్రజల నుంచి భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. సబ్ రిజిస్ట్రార్‌ను, అతనికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే…
పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ఆ పని చేసిపెట్టేందుకు ఏకంగా రూ. 16,500 లంచం డిమాండ్ చేశాడు. ఈ అవినీతి వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్ రషీద్ కూడా సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై రైతును ఇబ్బందులకు గురి చేశాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు రైతు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళిక రచించిన ఏసీబీ అధికారులు వల పన్నారు. కార్యాలయంలో బాధితుడి నుంచి సబ్ రిజిస్ట్రార్ రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ కలిసి ఆ లంచం డబ్బును (రూ. 16,500) తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం, కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లను, రికార్డులను పరిశీలిస్తోంది. పట్టుబడిన అధికారులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

