(MS8NEWS డిసెంబర్ 20):జలాల్‌పూర్‌కు చెందిన చిన్న సాయిలు అనే రైతు, తన క్రాప్ లోన్ (పంట రుణం) వడ్డీని చెల్లించేందుకు వర్నిలోని కెనరా బ్యాంక్ శాఖకు వెళ్లారు. అతను సమర్పించిన నగదులో రూ. 500 విలువ గల నోట్లు అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంక్ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అవి దొంగ నోట్లు (Counterfeit Currency) అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రైతును అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామస్థులకు ఓట్ల కోసం పంచిన డబ్బులో ఈ నోట్లు వచ్చినట్లు రైతు వెల్లడించారు.సదరు అభ్యర్థి పంపిణీ చేసిన మొత్తం నగదులో దాదాపు రూ. 2 లక్షల 8 వేల 500 వరకు దొంగ నోట్లే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.దొంగ నోట్లు పంచిన అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది.ఈ అభ్యర్థి మాజీ స్పీకర్ మరియు సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సదరు అభ్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు కావడంతో, ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో పోలీసులు ఈ కేసును ఎంతవరకు లోతుగా విచారిస్తారు అనే దానిపై గ్రామస్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

