(MS8NEWS జనవరి 10): శ్రీవారి మెట్టు నడక మార్గంలోని 400 – 450వ మెట్టు మధ్య చిరుత సంచరించడాన్ని భక్తులు గుర్తించారు. చిరుతను చూడగానే భక్తులు భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ (TTD) సెక్యూరిటీ సిబ్బంది మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భక్తుల రక్షణ దృష్ట్యా అధికారులు ఉదయం సుమారు రెండు గంటల పాటు ఈ మార్గంలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఉదయం 8 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించిన అధికారులు, భక్తులను ఒంటరిగా వెళ్లకుండా కనీసం 50 నుండి 100 మందిని ఒక గుంపుగా (Batches) పంపిస్తున్నారు. చిన్నారులతో వెళ్లే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత జాడల కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే బోన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
ముఖ్య గమనిక: శ్రీవారి మెట్టు లేదా అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ, గుంపులుగా వెళ్లడం సురక్షితం.

