MS8NEWS జనవరి 29 తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పవిత్రతకు భంగం కలిగించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తిరుమల నడక దారులు, మాడ వీధుల్లో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై టీటీడీ (TTD) కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ, ఓ నూతన జంట బరితెగించి వ్యవహరించడం ఇప్పుడు భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.
నిబంధనలు బేఖాతరు.. భంగిమలే లక్ష్యం :ఆలయ పరిసరాల్లోని గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు సదరు నూతన జంట అత్యుత్సాహం ప్రదర్శించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వివిధ భంగిమల్లో ఫోటోలు దిగారు. సామాన్య భక్తులు దైవ దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటే, ఈ జంట మాత్రం సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
నిద్రపోతున్న భద్రతా విభాగం? : తిరుమలలో మొబైల్ ఫోన్ల వినియోగం, ఫోటోగ్రఫీపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ ముఖద్వారం వద్ద నిరంతరం నిఘా ఉంచే విజిలెన్స్ మరియు భద్రతా సిబ్బంది, ఈ ఫోటో షూట్ జరుగుతుంటే ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వందలాది కెమెరాలు, సెక్యూరిటీ పాయింట్లు ఉన్నా ఈ జంట గంటల తరబడి ఫోటోలు దిగడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని భక్తులు విమర్శిస్తున్నారు.సామాన్య భక్తులు పొరపాటున ఫోన్ తీస్తేనే కఠినంగా వ్యవహరించే సిబ్బంది, ఇలాంటి ప్రొఫెషనల్ తరహా షూట్లను ఎలా అనుమతించారని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.
భక్తుల ఆవేదన :“తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, పిక్నిక్ స్పాట్ కాదు” అని భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన గొల్లమండపం వద్ద ఇలాంటి ప్రైవేట్ ఫోటో షూట్లు నిర్వహించడం వల్ల ఆలయ మర్యాద దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి, సదరు జంటపై మరియు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

