WhatsApp Greeting Scam: న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ ఉచ్చు… ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ!
మరికొన్ని గంటల్లో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ… కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు వాట్సాప్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
రంగురంగుల ఇమేజ్లు, ఆకర్షణీయమైన వీడియోలు, భావోద్వేగ సందేశాలతో ఇన్‌బాక్సులు నిండిపోతున్నాయి.
అయితే ఇదే పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేస్తున్నారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు చూసే ఒక చిన్న “Happy New Year” ఇమేజ్ లేదా ఫైల్… మీ జీవితకాల సంపాదనను క్షణాల్లో తుడిచిపెట్టేసే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
పండుగ వేళ పెరిగిన సైబర్ ముప్పు
గత రెండు దశాబ్దాలుగా డిజిటల్ టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందో, అంతే వేగంగా సైబర్ నేరాల పద్ధతులు కూడా మారుతున్నాయి.
ప్రత్యేకించి న్యూ ఇయర్, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో ప్రజల అప్రమత్తత తగ్గుతుందన్న విషయాన్ని సైబర్ నేరగాళ్లు తమ బలంగా మలుచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరూ రాబోయే కొన్ని రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇమేజ్‌ల్లోనే మాల్వేర్?
సాధారణంగా మనకు ఎవరో ఫోటో పంపితే… అది కేవలం ఒక చిత్రం అని భావిస్తాం.
కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరగాళ్లు ఫోటోల లోపలే బైనరీ డేటాను దాచిపెడుతున్నారు. ఇది ఒక రకమైన మాల్వేర్ కోడింగ్.
మీ ఫోన్‌లో ముందే ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ ఉంటే… ఈ ఇమేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే అది యాక్టివేట్ అవుతుంది.
దీని ఫలితంగా మీ మొబైల్ ఫోన్‌పై నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ ఆపరేట్ అవుతూ… బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం అయ్యే ప్రమాదం ఉంది.
‘Happy New Year’ పేరుతో APK ఉచ్చు
ఈ సీజన్‌లో సైబర్ నేరగాళ్లు విసురుతున్న మరో పెద్ద వల APK ఫైల్స్.
చూడటానికి ఇవి సాధారణ ఫోటోలాగా కనిపిస్తాయి. కానీ ఫైల్ పేరు చివర్లో .apk ఎక్స్‌టెన్షన్ ఉంటుంది.
వాట్సాప్‌లో Happy New Year Image, New Year Wishes Photo వంటి పేర్లతో ఇవి పంపిస్తున్నారు.
వినియోగదారులు ఆత్రుతతో ఫోటో అనుకుని డౌన్‌లోడ్ చేస్తారు. కానీ అది వాస్తవానికి ఒక సాఫ్ట్‌వేర్ ఫైల్.
దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్‌లో మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.
ఈ యాప్ మీ బ్యాంకింగ్ యాప్‌ల లాగిన్ వివరాలు, యూజర్ ఐడీలు, ఓటీపీలను దొంగిలిస్తుంది.
ఫలితంగా… మీకు అలర్ట్ మెసేజ్ కూడా రాకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు.
భావోద్వేగాలే నేరగాళ్ల ఆయుధం
పండుగల సమయంలో ఉత్సాహం, ఆనందం ఎక్కువగా ఉండటం సహజం.
అదే సమయంలో డిజిటల్ భద్రతపై నిర్లక్ష్యం పెరుగుతుందని నేరగాళ్లు గమనిస్తున్నారు.
గతంలో లింక్‌ల ద్వారా మోసం చేసిన వారు… ఇప్పుడు ఫోటోల రూపంలోనే సాఫ్ట్‌వేర్ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
డిజిటల్ లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరూ ఈ ముప్పు పరిధిలోనే ఉన్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలా రక్షించుకోవాలి? – నిపుణుల సూచనలు
డిజిటల్ యుగంలో అప్రమత్తతే అతి పెద్ద భద్రత. సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
1. ఫైల్ ఎక్స్‌టెన్షన్ చెక్ చేయండి
ఫోటో అయితే .jpg, .jpeg, .png మాత్రమే ఉండాలి.
ఫైల్ చివర .apk ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
2. తెలియని వ్యక్తుల మెసేజ్లు ఓపెన్ చేయొద్దు
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు, లింక్‌లకు దూరంగా ఉండండి.
3. వాట్సాప్ ఆటో డౌన్‌లోడ్ ఆఫ్ చేయండి
మీడియా ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయడం తప్పనిసరి.
4. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ వాడండి
నాణ్యమైన యాంటీ వైరస్ లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.
5. అవగాహన పంచుకోండి
ఈ మోసాల గురించి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు వివరించండి.
మీ అవగాహనే వారిని పెద్ద నష్టం నుంచి కాపాడవచ్చు.

