Monday, April 13, 2026

కేటీఆర్‌కు హ్యాట్రిక్ విజయం కానుకగా ఇవ్వాలి ​- కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం.. కూల్చివేతలే ఎక్కువ ​- 60 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపు ఇచ్చిన కోరుకంటి చందర్..

MS8NEWS రామగుండం, జనవరి 18 :రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి బి.ఆర్.ఎస్ (BRS) పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, మేయర్ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లుగా రామగుండంలో అభివృద్ధి పేరుతో సామాన్యుల బతుకులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. “ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కేవలం కూల్చివేతలు, కమిషన్ల దందా మాత్రమే సాగుతోంది. చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసపూరిత పాలన సాగిస్తున్నారు” అని ధ్వజమెత్తారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామగుండం నియోజకవర్గంలో జరిగిన కళ్లు మిరుమిట్లు గొలిపే అభివృద్ధిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని చందర్ సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థుల ఎంపికపై స్పష్టత:కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో బి.ఆర్.ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఉంటుందని, క్షేత్రస్థాయి సర్వేలు మరియు సమన్వయ కమిటీల నివేదికల ఆధారంగానే గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు కౌశిక హరి, మూల విజయ రెడ్డి, నడిపెల్లి మురళీధర్ రావు, మిర్యాల రాజిరెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, నడిపల్లి అభిషేక్ రావు, పి.టి స్వామి మరియు ఇతర ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Most Popular