MS8NEWS జనవరి 15 :కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన ‘హనీట్రాప్’ ముఠా గుట్టును రూరల్ పోలీసులు రట్టు చేశారు. సోషల్ మీడియాను ఎరగా వేసి, అమాయకులను, వ్యాపారస్తులను బుట్టలో వేసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గత రెండేళ్లుగా కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి, శ్రీ సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్య ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి యువకులను, వ్యాపారస్తులను ఆకర్షించేవారు. డబ్బులిస్తే సెక్స్‌లో పాల్గొంటానని నమ్మించి వారిని అపార్ట్‌మెంట్‌కు పిలిపించేవారు.భార్యతో సెక్స్‌లో పాల్గొంటున్న సమయంలో, భర్త రహస్యంగా ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు.ఇలా సేకరించిన వీడియోలతో దాదాపు 100 మందిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బుతో అపార్ట్‌మెంట్ EMIలు కట్టడమే కాకుండా, కారు, ఏసీలు, విలువైన వస్తువులతో దర్జాగా జీవిస్తున్నారు.
కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తికి ఈ దంపతులతో పరిచయం ఏర్పడింది. అతని వద్ద నుండి ఇప్పటికే దాదాపు 14 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు అతని వద్ద డబ్బులు లేవని చెప్పినా వదలకుండా, మరో 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో సదరు బాధితుడు జనవరి 13న పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల మెరుపు దాడి – అరెస్ట్
ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.జనవరి 14 ఉదయం టేస్టీ దాబా వద్ద కారులో వెళ్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుండి ఒక టాటా కారు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, బాధితుడికి సంబంధించిన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
కేసు నమోదైన 24 గంటల్లోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ రూరల్ పోలీసు సిబ్బందిని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణలకు లొంగి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

