MS8NEWS చిట్యాల, జనవరి 17 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం వాహనాన్ని అప్పగించాల్సింది పోయి, 55 రోజుల తర్వాత అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఎస్సై శ్రవణ్ రావుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రసన్నం కోసం సామాన్యులను వేధిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం.. 2025 నవంబర్ 21న చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బాధితుల వాహనం పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మరుసటి రోజే బండిని అప్పగిస్తామని చెప్పారు. అయితే, ఆ మరుసటి రోజు నుండి బాధితులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, ఏదో ఒక సాకుతో ఎస్సై శ్రవణ్ రావు కాలయాపన చేస్తూ వచ్చారు.
55 రోజుల తర్వాత ‘గుడుంబా’ ట్విస్ట్
దాదాపు రెండు నెలల పాటు వాహనాన్ని తన వద్దే ఉంచుకున్న ఎస్సై, ఇప్పుడు ఆ వాహనంలో ‘గుడుంబా’ దొరికిందంటూ కొత్త పల్లవి అందుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనంలో అకస్మాత్తుగా నిషేధిత మద్యం ఎలా ప్రత్యక్షమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో పట్టుకున్న గుడుంబాను తమ బండిలో పెట్టి తప్పుడు కేసు నమోదు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.
రాజకీయ కోణం?
చింతకుంట రామయ్య పల్లి గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి సంతృప్తి కోసమే ఎస్సై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని బాధితులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. “నిషేధిత వస్తువులు దొరికితే నిందితులతో కలిపి మీడియా ముందు ప్రదర్శించాలనే నిబంధన ఉంది. కానీ, అవేమీ లేకుండా ఇప్పుడు కట్టుకథలు అల్లడం వెనుక ఆంతర్యమేమిటి?” అని వారు ఎస్సైని నిలదీస్తున్నారు.
కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసులు పెడుతూ తమను వేధిస్తున్న ఎస్సైపై విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తమ వాహనాన్ని తమకు ఇప్పించాలని, అక్రమ కేసుల నుండి తమకు విముక్తి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

