Sunday, April 12, 2026

ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

MS8NEWS   మార్చ్ బ్యాటింగ్ లో కొన్ని పరుగులు తక్కువగా చేయడం తమ ఓటమిని శాసించిందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. ఇన్నింగ్స్ చివర్లో ఇంకాస్త దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సంజూ ఇన్నింగ్స్ అద్భుతం..ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షై హోప్.. బ్యాటింగ్‌లో మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించాడని కొనియాడాడు. ‘ఇది ఛేజింగ్‌కు అనుకూలించే మైదానం కాబట్టి.. మేం మరికొన్ని పరుగులు చేయాల్సింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో ఇంకాస్త ధాటిగా ఆడి ఉండాల్సింది. సంజూ నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందుకు అతనికి క్రెడిట్ ఇవ్వాలి. కానీ మేం మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.జస్‌ప్రీత్ బుమ్రా భారత ప్రధాన బౌలర్లలో ఒకడు. అతని చేతిలో బంతి ఉందంటే ఏదో ఒకటి జరుగుతుందని తెలుసు. ముఖ్యంగా హెట్మైర్ ఈ టోర్నీలో చాలా బాగా ఆడుతున్న సమయంలో బుమ్రా అతన్ని పెవిలియన్ చేర్చాడు. అతని వికెట్ తీయడం ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అయినప్పటికీ మేం 190 ప్లస్ పరుగులు చేసి గెలిచే అవకాశాలను సృష్టించుకున్నాం.

మరో మ్యాచ్ గెలిచి ఉంటే..ఈ టోర్నీలో మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. విభిన్న పరిస్థితులకు తగ్గట్టుగా మా బౌలర్లు బాగా అలవాటు పడి రాణించారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలింగ్ చేసిన తీరుకు వారిని అభినందించాలి. అకీల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే మోటీ జట్టులోకి వచ్చాక తన వంతు పాత్ర పోషించాడు. కానీ ఈ రోజు మేం గెలుపు గీతను దాటలేకపోయాం. ఎవరూ కూడా ఈ దశలో నిష్క్రమించాలని కోరుకోరు.మరో మ్యాచ్ గెలిచి ఉంటే మేం సెమీస్‌లో ఉండేవాళ్లం. అక్కడ బాగా రాణించి ఉంటే ఫైనల్‌ చేరే వాళ్లం. ఈ మ్యాచ్‌లో ఓడినా మా ఆటగాళ్లను అభినందించాలి. మేం మా కోసం ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నాం. మ్యాచ్ రోజున మేం మా అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. ఈ మ్యాచ్‌లో కీలక సమయాలను మాకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యాం.’అని షై హోప్ చెప్పుకొచ్చాడు.

Related Articles

Most Popular