Sunday, April 12, 2026

ఆర్టీఐ దరఖాస్తులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: రాష్ట్ర సమాచార కమిషనర్లు రామగుండం పారిశ్రామిక ప్రాంత సమస్యలపై కమిషనర్లతో మహేందర్ గౌడ్ చర్చ

రామగుండం MS8NEES:ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలయ్యే దరఖాస్తులకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు స్పష్టం చేశారు. మంగళవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, ‘ఇది మన హక్కు’ సమాచార పత్రిక ఎండి వడ్లకొండ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలిశారు.

సింగరేణి మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు విచ్చేసిన రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు పి.వి. శ్రీనివాస రావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం సమీపంలో మహేందర్ గౌడ్ కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి ‘మన హక్కు’ డైరీలను అందజేశారు.

పారిశ్రామిక ప్రాంత సమస్యలపై చర్చ:

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు, విద్యాసంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై దాఖలు చేస్తున్న ఆర్టీఐ దరఖాస్తుల పట్ల అధికారుల తీరును మహేందర్ గౌడ్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్లు, ప్రజల హక్కుల పరిరక్షణలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధికారులు చట్టాన్ని గౌరవించి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి కండె సాగర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్, విజయ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular