Wednesday, February 11, 2026

అన్నవరం ప్రసాదం కౌంటర్లలో ఎలుకల స్వైరవిహారం: భక్తుల ఆవేదన, సిబ్బంది దురుసు ప్రవర్తన

MS8NEWS జనవరి 24 అన్నవరం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన, భక్తులు ఎంతో భక్తితో స్వీకరించే సత్యనారాయణ స్వామి ప్రసాదం బుట్టల్లో ఎలుకలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది.

​క్షేత్రస్థాయిలో అసలేం జరిగిందంటే..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఈ క్షేత్రంలో, ప్రసాదం విక్రయించే కౌంటర్ల వద్ద ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. ప్రసాదం ఉంచిన బుట్టల్లోనే ఎలుకలు ఉండటం చూసి భక్తులు విస్తుపోయారు. పవిత్రమైన ప్రసాదం విషయంలో ఇంతటి అపరిశుభ్రత ఏంటని అక్కడి సిబ్బందిని భక్తులు ప్రశ్నించారు.

​బాధ్యతారాహిత్యంగా సిబ్బంది సమాధానం :పరిస్థితిని గమనించి నిలదీసిన భక్తులపై దేవస్థానం సిబ్బంది అత్యంత దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

“కొనుక్కుంటే కొనండి.. లేకపోతే వెళ్లిపోండి” అంటూ సిబ్బంది భక్తులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.నాణ్యత పాటించాల్సిన చోట ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల వాదన: “దూర ప్రాంతాల నుండి ఎంతో భక్తితో వస్తాం. ప్రసాదం బుట్టల్లో ఎలుకలు తిరుగుతుంటే కనీసం శుభ్రం చేయకపోగా, ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం?”

 

​అధికారుల స్పందన కరువు

​ప్రసాదం తయారీ, నిల్వ కేంద్రాల్లో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. గతంలోనూ అన్నవరం ప్రసాదం నాణ్యతపై పలు విమర్శలు వచ్చినప్పటికీ, తాజా ఘటన భక్తుల ఆరోగ్యంతో ఆడుకోవడమేనని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Related Articles

Most Popular