Monday, April 13, 2026

అధ్యాపకుల అమానవీయత: విద్యార్థిని బలి! ​‘పీరియడ్స్ వచ్చాయంటే.. చూపించు’ అని వేధింపులు ​అవమానం భరించలేక ఇంటికి వెళ్ళిన విద్యార్థిని మృతి ​మారేడుపల్లి ప్రభుత్వ కాలేజీ వద్ద ఉద్రిక్తత

(MS8NEWS జనవరి 9): హైదరాబాద్ (వెస్ట్ మారేడుపల్లి), :విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కాలయముళ్లయ్యారు. పీరియడ్స్ వల్ల ఆలస్యమైందని మొరపెట్టుకున్నా వినకుండా, తోటి విద్యార్థుల ముందే ఓ యువతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని.. మెదడులో రక్తం గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.మల్కాజిగిరికి చెందిన వర్షిణి (17) మారేడుపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బుధవారం కాలేజీకి కొంత ఆలస్యంగా వచ్చిన ఆమెను శ్రీలక్ష్మి, మధురిమ అనే అధ్యాపకులు క్లాసులోకి రానివ్వలేదు. తాను పీరియడ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆలస్యమైందని వర్షిణి వేడుకుంది. అయితే, సదరు అధ్యాపకులు కనికరం లేకుండా.. “నాటకాలు ఆడుతున్నావా? పీరియడ్స్ వస్తే ఏది చూపించు” అంటూ అసభ్యకరంగా, అమానవీయంగా దూషించారు.అందరి ముందు జరిగిన ఈ అవమానాన్ని వర్షిణి తట్టుకోలేకపోయింది. కన్నీళ్లతో ఇంటికి చేరిన ఆమె, జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, మెదడులో రక్తనాళాలు చిట్లి (Blood Clot) మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి (Mental Trauma) కారణంగానే ఇది జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.వర్షిణి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు శుక్రవారం కాలేజీ ముందు భారీ ఆందోళన చేపట్టారు. బాధ్యులైన లెక్చరర్లను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిని విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

​”ఒక ఆడపిల్ల పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన మహిళా లెక్చరర్లే ఇంత దారుణంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం.”

Related Articles

Most Popular