Sunday, April 12, 2026

అధికారుల కడుపు నింపుకోడానికి కార్మికుల కడుపు కొడతరా ? సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య సూటి ప్రశ్న…

 

అధికారుల కడుపు నింపుకోడానికి కార్మికుల కడుపు కొడతరా ?

సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య సూటి ప్రశ్న…

 *స్టాంప్ డ్యూటీ డబ్బులు డిపాజిట్ చేయక పోవడం వల్ల ఈ రోజు కార్పోరేషన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది*

ఈ రోజు వరకు ఇంకా 125 మంది కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని *రామగుండం నగరపాలక సంస్థ అధికారులపై సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.* మీ అధికారుల కడుపు నింపుకోడానికి కార్మికుల కడుపు కొడతరా అని ప్రశ్నించారు

రామగుండం కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మికుల జీతభత్యాల కోసం స్టాంప్ డ్యూటీ రూపంలో నిధులను డిపాజిట్‌గా ఉంచుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ రామగుండం నగరపాలక సంస్థ అధికారులు వాటిని పట్టించుకోలేదని వారు ఆరోపించారు. గత ఏడాది 16కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల చేసినా అధికారుల దురాశ వల్ల ఈ రోజు పండగ పూట కార్మికులు పస్తున ఉండే పరిస్తితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో సుమారు 550 పైగా కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కనీసం ఆరు నెలల నిధులు నిల్వగా ఉంచాలని సూచనలు ఉన్నప్పటికీ, ఇక్కడి అధికారులు ఆ నిధులను అభివృద్ధి పనుల పేరుతో వినియోగించామని ప్రభుత్వానికి నివేదికలు పంపడం అధికారుల దుర్బుద్ధి కి నిదర్శనం అని అన్నారు.ఈ పరిస్థితుల కారణంగా రామగుండం కార్పొరేషన్‌లోని కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నేటికి జీతాలు పడకపోవడం దుర్మార్గ చర్య అన్నారు. జీతాలు సమయానికి అందకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, బ్యాంకులు మరియు ఇతర ఫైనాన్స్ సంస్థల వద్ద తీసుకున్న రుణాలకు సంబంధించిన చెక్కులు బౌన్స్ అవుతూ కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిన్న చిన్న అవసరాల కోసం తీసుకున్న రుణాలకు వడ్డీపై వడ్డీ పడుతూ కుటుంబాలపై అదనపు భారంగా మారిందన్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిన స్టాంప్ డ్యూటీ నిధులను కార్మికుల కోసం డిపాజిట్‌గా ఉంచాలని తాను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని సూర్య తెలిపారు. కొంతమంది అధికారులు, నాయకులు కలిసి టెండర్ల పేరుతో అవినీతి చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఈ టెండర్లపై త్వరలో విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.రామగుండం కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo దృష్టికి తీసుకపోతానని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, మేయర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి కార్మికులకు వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మర్కపురి సూర్య డిమాండ్ చేశారు.

Related Articles

Most Popular